యాత్ర
- krishna mohan
- Nov 10, 2022
- 1 min read
తలెత్తినప్పుడల్లా కనిపించే పక్షుల్ని చూసి సిగ్గుతో తలదించుకోవాలి మనం గొప్పగా కట్టుకున్నఎత్తైన భవంతులన్నీ కదల్లేనితనానికి ప్రతీకలే
బతకటమంటే ఓ ఇంటి కప్పు కింద కుర్చీలోనో మంచం మీదో దేహాన్ని ఓ బస్తా చేసి ఎత్తి కుదేయటమో నిర్దిష్ట గమ్యాల మధ్య అటు నుండి ఇటుకి ఇటునుండి అటుకి బండి చక్రంలా దొర్లుకు పోవటమేనా? ఇంటినో పేటనో నగరాన్నో గుంజగా చేసుకొని గుండ్రాలు కొడుతూ తిరగటమే జీవితమైనప్పుడు ఊహలు కలలు కాలిపోతున్న కమురు వాసన!
సాగాలి ఎగబాకాలి కాళ్ళు తీగెలై సాగాలి డాబా మీదకి పాకే పూల తీగెలా పరవశించాలి పెంకుటింటి మీద గుమ్మడి పాదులా మిలమిలా మెరిసిపోవాలి
ఇళ్ళు గుళ్ళు భవంతులు గుడిసెలు పార్లమెంట్లు కోర్టులు…అన్నింటినీ ఒక దృశ్యం గా చాపచుట్టేసి కనుపాపల్లోకి తోసేసి రోజూ పైకి తలెత్తి చూసే మబ్బుల్ని కళ్ళకింద తొక్కిపెట్టి ఎగరటాన్ని మించిన ఉద్వేగమేమున్నది? సరిహద్దులు దాటడాన్ని మించిన అనుభవమేముంది?
పోవాలి ఉన్న చోటు నుండి మరెక్కడికో పోయి రావాలి ఎప్పుడూ చూడని భూమిని ఇళ్ళనీ ఆప్యాయంగా హత్తుకొని తీరాలి కొత్త చోటులో గాలిని గుండెలోకి ఒంపుకొని రావాలి కొత్తకొత్తగా కనబడే ముఖాల్ని తడిమి రావాలి నిన్ను వాళ్ళు వాళ్లని నువ్వు సంభ్రమంగా చూసే అనుభవాల్ని జేబులో వేసుకు రావాలి అపరిచితుల చిర్నవ్వులో తొణికిసలాడే పురాస్పర్శని ఒడిసిపట్టి దోసిలిలో ఓలలాడించి మురిసిపోవాలి
రెక్కలు లేకపోతేనేం? కనీసం ఊహల్లో ఎగిరి కాళ్లతో చుట్టి రావాలి!
by అరణ్య కృష్ణ
Recent Posts
See All- గోరేటి వెంకన్న సంచారమే ఎంతో బాగున్నది దీన్నంత ఆనంద ఏమున్నది ఇల్లు పొల్లు లేని ముల్లె మూట లేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సంచారమే...
Comments