ఎప్పటి నుంచో దేశం మొత్తం చూడాలి, తిరగాలి. వివిధ భాషల సంగీతం, ఆయా భాషల సాహిత్యం, వారి ఆహారం, జీవన విధానం, ఇవన్నీ చూడాలని కోరిక. వారితో కొన్ని రోజులు ఉండాలి. వారి పరిసరాలలో కలిసి పోవాలి. వారి మనిషిగా బతికేయాలి. ఎలాంటి టైం షెడ్యూల్ లేకుండా నచ్చిన ప్రదేశంలో నచ్చినన్ని రోజులు ఉండాలి. వారి జీవిత కథలను, అనుభవాలను వారి నోటి నుంచే వినాలి.
ఎలా?
Ok బైక్ మీద వెళ్దాం. బైక్ మీద జర్నీ ఎప్పుడూ సూపరే. 180 డిగ్రీ వ్యూ మరే ప్రయాణ సాధనంలో దొరకదు. ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా తోకలా మా వాడు నా వెంటే ఉంటాడు. బైక్ మీద ప్రయాణం గంట సమయం దాటితే చల్లగాలికి వాడికి నిద్ర వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాలకు చాలా ఇబ్బంది. వాడిని వొదిలి వెళ్ళలేను. ఒకవేళ వెళ్లినా అక్కడికి వెళ్లి ఫీల్ అవుతూ ఉంటాను వదిలి వచ్చినందుకు.
మరి ఎలా?
ఫోర్ వీలర్
ఎన్ని ఫ్యూచర్స్ ఉన్నా, ఎంత కాస్ట్లీ అయినా car నన్ను ఎప్పుడూ ఆకట్టుకోలేదు. మనసు మాత్రం van మీదే ఉండేది. యూట్యూబ్ లో బయట దేశాల్లో van life గురించి చూస్తుండే వాడిని. అక్కడ ఉన్నన్ని ఆప్షన్లు ఇక్కడ లేవు. ఎప్పటికైనా van తీసుకొని దాన్ని మోడిఫై చేసి చిన్న హౌస్ లాగా మార్చి ప్రయాణం మొదలు పెట్టాలి.
మాకు రోజు వాటర్ కాన్ లు వేసే శివనాగిరెడ్డి(బహు కష్టజీవి) స్కూల్ పిల్లల్ని దింపడానికి వాన్ (Tata Venture) తీసుకున్నాడు. ఆ Van స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి మా ఇంటికి ఎదురు వచ్చినప్పుడల్లా పైనుంచి కిందకి రావడం దాన్ని తనివితీరా చూసుకోవడం, వివరాలు అడగడం. కొద్దిరోజుల తర్వాత omini తో రావడం మొదలుపెట్టాడు. ఆ van mileage వర్కౌట్ అవడం లేదని అందుకే దాన్ని పక్కన పెట్టాను అని చెప్పాడు. ఇంకేం అతను అమ్మడానికి, నేను కొనడానికి రెడీ. ఎన్నో రోజుల కల ఒక రూపుకు వచ్చింది.
రోజు ఆఫీసుకు వేసుకు వెళ్ళేవాడిని అలవాటు అవ్వాలి కదా అని.
ఇంట్లో వాళ్ళు కూడా నసపెట్టడం మొదలు పెట్టారు. కార్ తీసుకోక ఏంది బాడుగ ఆటో అని?
Van లో పోతుంటే, షేర్ ఆటో అనుకొని జనాలు చేతులు ఎత్తటం నేను ఆపకుండా వెళ్లిపోవడం. ఆటో వాడికి ఇంత పొగరు ఏంట్రా? ఆటో మొత్తం ఖాళీగా ఉన్నా, బాడుగ ఎక్కించుకొకుండా వెళ్తున్నాడు అని తిట్టుకోవడం గమనించే ఉన్నాను. రెండేళ్ళు గడిచిపోయాయి.
ఎప్పుడూ ఏవో కాలిక్యులేషన్స్
అన్ని సెలవులు ఎలా ఇస్తారు? డబ్బులు ఎలా ?
ఒకరోజు డిసైడ్ అయ్యాను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని?